మన గ్రామీణ నులక మంచం మాత్రం లక్షకు పైగా పలుకుతున్నది. ఇది మనదేశంలో కాదు.. అమెరికాలోనండి. పైగా అక్కడ ఈ టైపు మంచాలకు తెగ డిమాండ్ కూడా ఉన్నదట. జనం ఎగబడి కొంటున్నారట. అమెరికాకు చెందిన ఎట్సీ అనే ఈ కామర్స్ సంస్థ తన ఆన్‌లైన్ స్టోర్‌లో నులకమంచాలను విక్రయిస్తున్నది. ఒక్కో మంచం ధర రూ.1.12 లక్షల రేట్ ఫిక్స్ చేసింది. అందంగా ముస్తాబు చేసిన భారతీయ సంప్రదాయ మంచం అని డిస్క్రిప్షన్‌లో ఇచ్చింది. మంచం పొడవు 72 అంగుళాలు, వెడల్పు 32 అంగుళాలుంటుంది. ఇప్పుడు ఈ సంస్థ వద్ద కూడా కేవలం నాలుగంటే నాలుగు మంచాలే స్టాక్ ఉన్నాయట. ఇప్పటి దాకా 82 నులక మంచాలను విక్రయించినట్టు సంస్థ పోర్టల్ పేర్కొన్నది. హైవేలలో రోడ్ల పక్కన వెలసిన చాలా దాభాల్లో ఇప్పటికీ నులక మంచాలు కనిపిస్తుంటాయి. సుదూర ప్రాంతాలకు సరుకులు రవాణా చేసే డ్రైవర్లు, క్లీనర్లు రాత్రిళ్లు, మధ్యాహ్నం తినే సమయాల్లో దాభాల్లోని నులక మంచాలపై సేదతీరుతూ కనిపిస్తుంటారు.


