సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇక్కడ నివసిస్తున్న తెలుగు వారందరినీ కలవడం ఆనందదాయకం. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా… భరతమాత గౌరవాన్ని పెంచాలన్న శ్రీ రాయప్రోలు వారి స్ఫూర్తితో సింగపూర్ లోని తెలుగువారు మన భాషా సంస్కృతులను కాపాడుకోవడంతో పాటు, ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఆనందదాయకం. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగపూర్ తెలుగు సమాజం నిర్వహణ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.


భాష అంటే మాట్లాడే నాలుగు పలుకులు కాదు. మన భాషలో మన సంస్కృతి ఉంది. మాతృభాష మన ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలి. మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస… మనమెప్పుడూ విడవరాదు. మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకోవాలి. ఎక్కడ ఉన్నా శ్రద్ధగా జరుపుకోవాలి. భాష సంస్కృతులను కాపాడుకోవడంతో పాటు నలుగురికి సాయం చేయడం మరువకండి. ఇక్కడ కష్టపడండి, సంపాదించండి, తిరిగి మన దేశానికి వచ్చి సేవ చేయండి. మీ అందరినీ సాదరంగా భారతదేశానికి ఆహ్వానిస్తున్నాను అన్నారు.















