పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే జాతీయ అసెంబ్లీ వాయిదా పడిరది. ఇటీవల మృతిచెందిన నేతలకు నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మార్చి 8వ తేదీన ప్రతిపక్షాలు అభ్యర్థన పత్రాన్ని సమర్పించాయి. సుమారు 152 మంది ప్రతిపక్ష సభ్యులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. అయితే పార్లమెంట్ మొదటి రోజు నేపథ్యంలో ఇటీవల మృతి చెందిన నేతలకు నివాళి అర్పించారు. ఆ తర్వాత సభా కార్యకలాపాలను వాయిదా వేశారు. మార్చి 28వ తేదీన ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్నది. దానిపై ఓటింగ్ జరగాలంటే, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మూడు రోజులూ ఉండాలి. ఓటింగ్ కోసం ఏడు రోజుల వ్యవధి దాటకూడదు. ఒకవేళ తీర్మానానికి మెజార్టీ సభ్యులు ఓకే చెబితే అప్పుడు ప్రధాని తన బాధ్యతల్ని వదులుకోవాల్సి వస్తుంది.