అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన రెండు కార్చిచ్చుల ధాటికి ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని, 10 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. కొత్త కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరింత మంది ప్రజలు అక్కడి నుంచి తరలి వెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.
సాన్ ఫెర్నాండో లోయలో మధ్యాహ్నం ప్రారంభమైన కొత్త కెన్నెత్ దావానలం సాయంత్రానికి పక్కనున్న వెంచురా కౌంటీకి వ్యాపించిందని వెల్లడించారు. బలమైన గాలులు తోడు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని, శుక్రవారం ఉదయానికి ఇవి మరింత బలపడొచ్చని లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బస్స్ తెలిపారు. కెన్నెత్ కార్చిచ్చు కు కారణమని భావిస్తున్న నిరాశ్రయుడిని పోలీసులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు కార్చిచ్చు కారణంగా ఖాళీ అయిన సంపన్నుల ఇండ్లను దోచుకోవడానికి దొంగలు ఎగబడుతున్నారు. ఇప్పటికే 20 మంది దొంగలను అరెస్ట్ చేశారు.