బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో 1994, 1999లో ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. అక్కడ తగిన గుర్తింపు లేకపోవడంతో పాటు ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తికి గురయ్యారు. కాషాయ దళాన్ని వీడారు.
టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందడంతో ఆ పార్టీలో చేరుతున్నారు. తాను ఏ పదవిని ఆశించకుండా బేషరతుగా టీఆర్ఎస్లో చేరుతున్నానని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. పెద్దిరెడ్డి చేరిక కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.