టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన, వివిధ దేశాలలో చేపట్టే కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించారు. అమెరికా పర్యటన ముగించుకున్న మహేష్ బిగాల అక్కడి వివరాలను తెలియజేశారు. నవంబర్‌లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు ఆయన తెలిపారు.
పీవీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యులను, తెలంగాణ నుంచి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని తెలుగు, ఇండియన్ డియాస్పోరా కాకుండా సెనెటర్, మిగతా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పీవీ జయంతి ఉత్సవాలను జరిగిన పని తీరుపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.