ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ ప్రకటించింది. ఇది కష్టసమయమని.. కానీ 2025 నాటికి ఉద్యోగుల్ని తగ్గించడం అత్యవసరమని కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ చెప్పారు.మూడు నెలల క్రితమే నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ తయారు చేసిన స్లీప్ రెస్పిరేటర్లపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భారీ స్థాయిలో ఆ పరికరాలను రికాల్ చేశారు.
అమ్స్టర్డామ్కు చెందిన ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది నాలుగవ త్రైమాసికంలో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. స్పలీప్ రెస్పిరేటర్ల పరికరాలను రీకాల్ చేయడం వల్ల ఆ నష్టం వచ్చినట్లు భావిస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారి కోసం తయారు చేసిన రెస్పిరేటర్లలో నాణ్యత లోపం వచ్చింది. అమెరికాలో ఆ ఉత్పత్తిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పరికరాన్ని రీకాల్ చేశారు.2023లోనే మూడు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు జాకబ్స్ తన ప్రకటనలో తెలిపారు. 130 ఏళ్ల క్రితం బల్బుల కంపెనీగా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు హై ఎండ్ హెల్త్కేర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది.