ప్రస్తుతం బ్రిటిష్ రాచరిక ఆభరణాలలో భాగంగా ఉన్న ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు వాపసు చేయాలంటూ లండన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. టవర్ ఆఫ్ లండన్‌లోని జువెల్ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనకు ఉంచిన కోహినూర్ అందాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న కోహినూర్ వజ్రం అనేకమంది రాజులకు, పాదుషాలకు శాపంగా పరిణమించింది. ఉజ్వలంగా కాంతులీనుతూ అతి సుందరంగా కనిపించే కోహినూర్ వజ్రం పురుష యజమానులకు మిగిల్చిన శోకం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.

105.6 క్యారెట్ల బరువు ఉండే కోహినూర్ పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే.. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో ఇప్పుడు తెలంగాణలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్న కొల్లూరు గనులలో కోహినూర్ వజ్రం మొదట బయటపడింది. ఎందరో రాజులు, రాజ్యాల చేతులు మారిన ఈ అపురూపమైన వజ్రం భీకర యుద్ధాలకు దారితీసింది. దీన్ని పొందేందుకు హింస, విద్రోహం, చిత్రహింసలు, హత్యలు వంటివి శతాబ్దాల తరబడి సాగాయి. భూమి, వనరులు, సిరిసంపదలు, పరువు ప్రతిష్ట, మహిళలు, గుర్తింపు, మతం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ ఓ వజ్రం కోసం జరిగిన యుద్ధాలు దాన్ని సొంతం చేసుకున్న పురుష యజమానులకు దురదృష్టాన్ని మిగిల్చాయి.















