అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుపై పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన వారి నివాసంలో విగ్రహ ప్రతిష్టాపనపై సమావేశం నిర్వహించారు. విగ్రహాన్ని ఇండియా నుంచి తరలించడం, తేదీ వివరాలు, కార్యక్రమ నిర్వహణ వంటి విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ కుటుంబ సభ్యులు, గాంధీ విగ్రహ ఫౌండేషన్ ప్రతినిధులను, లోకల్ సెనేటర్స్‌ని, అమెరికా వ్యాప్తంగా ఉన్న పీవీ అభిమానులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచి పీవీ కుటుంబ సభ్యులను ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నట్లు కేకే తెలిపారు.
కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, మిగతా దేశాలలో విగ్రహ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు తెలిపారు. ఈ సమావేశంలో పీవీ విగ్రహ కమిటీ సభ్యులు పీవీ ప్రభాకర్ రావు, మహేష్ బిగాల, చంద్రశేఖర్, అమెరికా ప్రతినిధి డా.పాడి శర్మ పాల్గొన్నారు.