రవితేజ కథానాయకుడిగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక కుటుంబకథా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలు. శ్రీనివాస్ చెరుకూరి నిర్మాత. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి వామ్మో.. వాయ్యో.. ఒల్లెంకలో.. నేనేం సేత్తూ సొల్లెంకలో అంటూ తెలంగాణ జానపద శైలిలో సాగే పాటను వరంగల్‌లో విడుదల చేశారు.

దేవ్ పవార్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, స్వాతిరెడ్డి ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. రవితేజ, అషికా రంగనాథ్, డింపుల్ హయాతి పై ఈ పాటను చిత్రీకరించారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ డ్యాన్స్ ఫ్లోర్‌ను దద్దరిల్లేలా చేసిందని మేకర్స్ పేర్కొన్నారు. మాస్‌కి విపరీతంగా నచ్చే పాట ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాణం: ఎస్‌ఎల్వీ సినిమాస్.















