అమెరికాలో హెచ్-1బీ వీసాపై పని చేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మి గ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) కాస్త ఉపశమనం కల్పించింది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో అమెరికా ను వీడాలని అందరూ భావిస్తుంటారని, అలాంటి అవసరం లేదని పేర్కొన్నది. లేఆఫ్‌కు గురైన వారు 60 రోజుల తర్వాత కూడా అమెరికాలో ఉండేందుకు పలు అవకాశాలు ఉన్నాయని చెప్పింది.
ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా వీసా స్టేటస్ మార్చుకునేందుకు, అడ్జస్ట్‌మెంట్ చేసుకునేందుకు దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. భార్య లేదా భర్తకు డిపెండెంట్‌గా హెచ్-4, ఎల్-2 వీసాగా మార్చుకొని ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. విద్యార్థి వీసా(ఎఫ్-1), విజిటర్ వీసా(బీ-1/బీ-2) స్టేటస్‌కు వీసాను మార్చుకోవచ్చని, అయితే విజిటర్ వీసాపై ఉద్యోగం చేయడానికి వీలు ఉండదని తెలిపింది. ఇవి కాకుండా యాజమానిని మార్చుకునేందుకు వీలు కల్పించేలా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.