
వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం రేగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సమీపంలో జరిగిన కాల్పుల ఘటన లో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అని వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌజర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యుల వద్దకు వచ్చిన ఓ దుండగుడు అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతిగా సైనికుల్లో ఒకరు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు కూడా గాయపడ్డాడు. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని గాయాలు ప్రాణాంతకం కాదని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
















