అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడేనికి చెందిన ఎన్నారై కొడుకు మృతి చెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన ఎన్నారై చెట్టుపెల్లి రాంచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా కుటుంబంతో లాస్‌ఏంజిల్స్‌లో నివసిస్తున్నారు. స్నేహితుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి కారులో భార్య అలివేలు, కూతురు అక్షిత, కొడుకు అర్జిత్ రెడ్డి(14)తో కలిసి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తూ.. లాస్‌ఏంజిల్స్‌లోని ఓ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును ఆపారు. ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ వారి కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న కుమారుడు అర్జిత్ రెడ్డి అక్కడిక్కడే దుర్మరణం చెందగా, రామచంద్రారెడ్డి, రజనీరెడ్డి, అక్షితారెడ్డి చికిత్స పొందుతున్నారని బంధువులు తెలిపారు. దీంతో బండ్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.














