ఇండోనేషియాలోని బాలిలో ఈ నెల 15-16 తేదీలలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నాయి. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. అతడి స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను భేటీకి పంపుతున్నారు. అయితే, ఈ సమావేశాలకు పుతిన్ హాజరయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఇండోనేషియాలోని రష్యన్ రాయబార కార్యాలయం ప్రోటోకాల్ చీఫ్ యులియా టామ్స్కాయ వెల్లడించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యం వెనుకంజ వేస్తున్న తరుణంలో జీ20లో చేరేందుకు బాలి వెళ్లకూడదని పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వాటి నివారణకు రష్యా మార్గాలను వెతుకుతున్నది. వాస్తవానికి, భారతదేశం, అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల నాయకులు జీ20 సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టేందుకు సరైన సమయం కానందున జీ20 సమావేశాలకు గైర్హాజరవడం ఒక్కటే మార్గమని రష్యా ఉన్నత వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.