ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ కు శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు షాకిచ్చారు. నగరంలోని ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో X ను తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో నగర యంత్రాంగం లోగోను తొలగించినట్లు తెలిపారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను సూపర్ యాప్ గా మార్చే క్రమంలో దాని పేరును సంస్థ అధినేత ఎలాన్ మస్క్ X గా మార్చిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ పిట్ట స్థానంలోకి X లోగో వచ్చి చేరింది. ఇందులో భాగంగా పేరు మార్చిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయంపై X లోగోను ఏర్పాటు చేశారు. అయితే, ప్రధాన కార్యాలయంపై ఆ లోగో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఎక్స్ లోగో కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని నగర వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎక్స్ లోగో డిస్ ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రిళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతోందని తెలిపారు. దీంతో తమ నిద్రకు ఆటంకం కలుగుతోందని 24 మంది స్థానికులు నగర యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆలోగోను తొలగించినట్లు శాన్ ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్ హన్నన్ తెలిపారు.