దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడిరది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్ 18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలోనే ఏడోది. ఆర్థికంగా, వాణిజ్య పరంగా ఎంతో లాభదాయకం కావడంతో భారత భారజల బోర్డు 2016లో రూ.53 కోట్లతో ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆక్సిజన్ 18 ఉత్పత్తి అమెరికా, రష్యా, చైనా వంటి ఆరు అగ్రరాజ్యాలకే పరిమితమైంది. ఇప్పుడు వాటి సరసన మన దేశం చేరింది. భారత భారజల బోర్డు అసోసియేట్ డైరెక్టర్ వీవీఎస్‌ఏ ప్రసాద్ మణుగూరు కర్మాగారానికి వచ్చారు. భరత అణుశక్తి చైర్మన్ కేఎన్ వ్యాస్ ఆక్సిజన్ 18 ప్లాంటును వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. భారజల బోర్డు చైర్మన్ జితేంద్ర శ్రీవాత్సవ, బార్క్ డైరెక్టర్ మహంతి పాల్గొన్నారు. ప్లాంటు జనరల్ మేనేజర్ జి.సతీశ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు పీజేవీ సుధాకర్, వెంకటేశ్, ఉపాధ్యా తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయపై ప్రకటన చేయనున్నారని సమాచారం.