అమెరికాను మరో తుఫాను తాకనున్నది. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న అమెరికాకు తుఫాను వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలతో పాటు పెద్దఎత్తున మంచు గడ్డలు కరగి వరదలు సంభవించే ప్రమాదం ఉన్నదని అధికారులు తెలిపారు. రోడ్లపై నిలిచే నీటితో ప్రయాణానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నదని, వేల గృహాలు, వాణిజ్య సంస్థలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవచ్చునని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో, సక్రమెంటో తీర ప్రాంతాలకు చెందిన 1.75 కోట్ల మందిపై ఈ తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ జారీ అయ్యాయి. తుఫాను నేపథ్యంలో ఇండ్లలో ఉండే వారికి, వ్యాపారులకు మౌంటిరే కౌంటీలో పలు సూచనలు జారీ అయ్యాయి. కనీసం రెండు వారాలకు సరిపడా ఆహార పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలని, వరద నుంచి రక్షణకు ఇసుక బ్యాగ్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని బిగ్ సర్ ప్రాంతవాసులకు అధికారులు సూచించారు.