జైలు శిక్ష అనుభవిస్తున్న తెహ్రీక్-ఈ -ఇన్సాఫ్ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్‌లోని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇమ్రాన్ పార్టీ పీటీఐని నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ సమాచార, ప్రసార మంత్రి అత్తావుల్లా తరార్ ప్రకటించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పీటీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీటీఐని నిషేధించ డానికి విదేశీ నిధుల కేసు, మే 9 అల్లర్లు, సైఫర్ ఎపిసోడ్ సహా పలు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, రిజర్వ్‌డ్ సీట్ల విషయంలో పీటీఐకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి ఇటీవలే సుప్రీంకోర్టులో ఉపశమనం కలిగిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు వెలువడిన రెండు రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.