
అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. డాలస్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్‌కు చెందిన దళిత విద్యార్థి పోలె చంద్రశేఖర్ మృతిచెందాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడు అని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ మరణం గురించి తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.
















