Namaste NRI

హైదరాబాద్​ లో పెరుగుతున్న ఆకాశహర్మ్యాలు- కోకాపేటలో 60 అంతస్తులను దాటేసి!

హైదరాబాద్​ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తూ వస్తోంది. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. 2025లో హెచ్​ఎండీఏలో దాదాపు 94, జీహెచ్​ఎంసీలో 103 బహుళ భారీ భవంతులకు అనుమతులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. హెచ్​ఎండీఏలో అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్టప్​ ఏరియాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. 2024లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే కావడం గమనార్హం.

కోకాపేట నియోపోలిస్​లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు అపార్ట్​మెంట్లు, ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలు నిర్మాణం జోరుగా సాగుతున్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 2024లో కేవలం 69 భారీ భవంతులకు అనుమతులు ఇస్తే, 2025 ఏడాది నాటికి ఆ సంఖ్య 103ను దాటేసింది. ఇతర సాధారణ భవనాలకు సంబంధించి 2,381 అనుమతులను ఇచ్చారు. గతేడాదితో పోల్చితే ఈ పెరుగుదల స్వల్పంగా ఉంది. హెచ్​ఎండీఏలో 2024లో కేవలం 55 బహుళ అంతస్తులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఈసారి ఆ సంఖ్య 94 భారీ అంతస్తుల భవనాలకు చేరుకుంది.  పై అంతస్తుల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం ముప్పు తక్కువగా ఉంటుందనే భావనతో చాలా మంది నివసించేందుకు ఆసక్తి, ఇష్టం చూపుతున్నారు.

దేశంలో ముంబయి, దిల్లీ ఇతర మహా నగరాల్లో ఫ్లోర్​ స్పేస్​ ఇండెక్స్​(ఎఫ్​ఎస్​ఐ) అమల్లో ఉంది. కానీ హైదరాబాద్​లో మాత్రం నియంత్రణ లేకపోవడం భారీ భవంతుల నిర్మాణాలు పెరగడానికి ఓ కారణమని నిపుణులు తెలుపుతున్నారు. ఎఫ్​ఎస్​ఐ వల్ల భారీ భవనాల నిర్మాణంలో వెసులుబాటు తక్కువగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఎఫ్​ఎస్​ఐ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. భవనాల ఎత్తు, విస్తీర్ణంలో నిర్ణీత నిబంధనలకు లోబడి వీటిని చేపట్టాలి. కానీ హైదరాబాద్​లో మాత్రం ఎఫ్​ఎస్​ఐ విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో భారీ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇటీవల ప్రభుత్వం బిల్డ్​నౌ సాఫ్ట్​వేర్​ను తీసుకువచ్చింది. గత సాఫ్ట్​వేర్​లో దరఖాస్తులు అప్​లోడ్​, పరిశీలనలో తీవ్ర జాప్యం జరిగింది. వీటన్నింటిని గమనించి వాటిలో మార్పులు చేర్పులను ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం నిమిషం వ్యవధిలోపే ప్లాన్​లు, మ్యాప్​లు అన్ని వివరాలు ఇందులో అప్​లోడ్​ అవుతున్నాయి. పరిశీలనలో కూడా వేగం పుంజుకుంది. దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు నమోదు చేస్తుండటం వల్ల తిరస్కరణ శాతం అనేది తగ్గుతోందని అధికారులు తెలుపుతున్నారు. దరఖాస్తుల తిరస్కరణ హెచ్​ఎండీఏ పరిధిలో 2023లో 18 శాతం, 2024లో 20 శాతం ఉంటే 2025లో దాని వాటా తగ్గుతూ 15 శాతానికి పడిపోయింది.

హైదరాబాద్​ సరికొత్త రూపును సంతరించుకుంటోంది. ఆకాశ హర్మ్యాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే గచ్చిబౌలి, నార్సింగి, కొండాపూర్​ చుట్టుపక్కల్లో భారీ కట్టడాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు వాటికి దీటుగా శంషాబాద్​, ఉప్పల్​, కిస్మత్​పూర్​, వనస్థలిపురం, అబిడ్స్​, ఎల్బీనగర్​, పోచారం, ఘట్​కేసర్​, గుడి మల్కాపూర్​, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లోనూ భారీ కట్టడాలు కడుతున్నారు. ఎత్తైన భవనాల్లో ముంబయి తర్వాత హైదరాబాద్​లోనే ఎక్కువ సంఖ్యలో కడుతున్నారంటే హైదరాబాద్​ ఎంత అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events