రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజ్మల్, మానస జంటగా నటించారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం మొదలు జగన్ అరెస్ట్, ఆ తర్వాత కొన్నేళ్లకు సీఎం కావడం, వైఎస్ వివేకా హత్య వంటి ముఖ్య సంఘటనలు ఉంటాయి.
ప్రజలకు తెలియని కొన్ని విషయాలను ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. ఇందులో పవన్‌కల్యాణ్, చంద్రబాబు నాయుడు పాత్రలు కూడా ఉంటాయి. అయితే వారి నిజ జీవితానికి ఏమాత్రం సంబంధం ఉండదు. నేను రాజకీయాల్లో లేకున్నా అక్కడ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారనే విషయంపై పూర్తి అవగాహన ఉంది. ఇక వ్యక్తిగతంగా మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదు అన్నారు. రామ్‌గోపాల్‌వర్మను ఎవరూ డబ్బులతో కొనలేరని, వెలకట్టలేని వ్యక్తిత్వం ఆయన సొంతమని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ప్రశంసించారు.