మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) ఎన్నికలు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మా ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేశారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మా ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మా సంక్షేమం కోసం తమ ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారని తెలిపారు. తన ప్యానల్‌లో గెలిచిన ఎనిమిది మంది ఈసీ మెంబర్లు శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, కౌశిక్, సుడిగాలి సుధీర్, సమీర్‌లతో పాటు శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీలు కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తమ సభ్యుల రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాష్ రాజ్ కోరారు.
ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి మా సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు. తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదని మీరు మార్చకపోతే మా సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఓటు వేయడానికో, ఎవరో ఒకర్ని గెలిపించడానికో అయితే మా సభ్యుడిగా ఉండటం నాకు ఇష్టం లేదని అని అన్నారు.