ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఓ సాధారణ సభ్యుడి నుంచి నాట్స్ అధ్యక్ష స్థానం వరకు ఎదిగిన శ్రీహరిని నాట్స్ కార్యవర్గం, సభ్యులు అభినందించారు. సంస్థలో కష్టపడే ప్రతి ఒక్కరికి నాట్స్ కచ్చితంగా అవకాశం కల్పిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీహరి వ్యాపార రంగంలో రాణించడం గర్వకారణమన్నారు. న్యూజెర్సీలో ప్రతి సేవా కార్యక్రమంలో శ్రీహరి పాత్ర విలువైనదని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సర్వీస్ చైర్మన్, నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షుడు, మోహన కృష్ణ మన్నవ అభినందనలు తెలిపారు.


జూలై 4,5,6 తేదీల్లో టంపా, ఫ్లోరిడాలో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సభలను విజయవంతం చేయాలని ప్రవాసులకు నాట్స్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. సంబరాల్లో బాలకృష్ణ, వెంకటేశ్, అల్లు అర్జున్, థమన్, దేవిశ్రీలు సందడి చేస్తారని తెలిపారు. సంబరాల నిర్వహణకు ఇదే వేదికపై నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించగా 4లక్షల డాలర్లకు హామీలు లభించాయని శ్రీహరి తెలిపారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని కిరణ్ మందాడి, న్యూజెర్సీ నాట్స్ ప్రతినిధులు సమన్వయపరిచారు.


న్యూజెర్సీలో నాట్స్ తెలుగమ్మాయి పోటీలు నిర్వహించారు. తెలుగు మాట, ఆట, పాట, సంస్కృతి అంశాలపై పోటీ నిర్వహించి విజేతలను ప్రకటించారు. విజేతల వివరాలు..సమికా సుబ్బారావు(టీన్ నాట్స్), నిహారిక బవిరిశెట్టి(మిస్ నాట్స్), వాహిని కాళిదాస్(మిసెస్ నాట్స్).
