టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే సినిమాలోని ఒక ప్రత్యేక భక్తి గీతాన్ని తాజాగా విడుదల చేశారు మేకర్స్.

కన్నప్ప చిత్రం నుండి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ భక్తి గీతానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తోడైంది. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటను ఆలపించారు. వారి గాత్రం ఈ పాటకు మరింత ఆధ్యాత్మికతను జోడించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్టీఫెన్ దేవస్సీ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆధ్యాత్మిక గీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను పెంచుతోంది.

భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మంచు మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో తెరకెెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
