అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. అద్భుతంగా అలంకరించిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు.. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తీ సంగీత గానం నడుమ శాస్త్రోకంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు. కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఏఈఓ వెంకటేశ్వర్లు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్, నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొరిశపాటి తదితరులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.














