అమెరికాలో మొదలైన పాలస్తీనా అనుకూల నిరసనలు యూరప్‌కు పాకాయి. తాజాగా పారిస్‌లోని సోబోన్ వర్సిటీ ఆవరణలో వందలాది మంది నిరసనకారులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలు ఎగురవేస్తూ, యుద్ధ బాధితులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలో పలు యూనివర్సిటీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నది.
కొలంబియా వర్సిటీలో ఆందోళనకారులు అక్కడి హామిల్టన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీ ప్రధాన గేట్లకు అడ్డుగా బారికేడ్లను ఏర్పాటుచేసి, భవనం కిటికీలో నుంచి పాలస్తీనా జెండాను ఎగురువేశారు. వర్సిటీల్లో భవనాల్ని స్వాధీనం చేసుకోవటం, ప్రధాన గేట్లను మూసేయటం, పాలస్తీనా జెండాలను ఎగురు వేయటం, వంటివి సోమవారం రాత్రి నుంచి మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతటా వర్సిటీల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిరసన శిబిరాల నుంచి విద్యార్థులను తరలించటంపై వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టెక్సాస్, ఉటా, వర్జీనియా, న్యూజెర్సీల్లో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.