సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే మొదటి కార్యక్రమము)ని 05 జనవరి 2025 నాడు విజయవంతంగా జరుపుకుంది, ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ భజనలు, ప్రత్యేక పాయసం నైవేద్యం మరియు హాజరైన వారందరికీ అన్నదానంతో శాస్తా ప్రీతి ని ఘనంగా నిర్వహించారు.
గణపతి, పూర్వాంగ పూజ మరియు అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైన కార్యక్రమం, సభ పాలక దేవత అయిన పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వరర్‌కు లఘున్యాసం, రుద్రాభిషేకం మరియు రుద్రగణ పారాయణం జేశారు. తదనంతరం అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్ర అర్చన, చివరలో అయ్యప్పను కీర్తిస్తూ భజనలు చేశారు. ఈ కార్యక్రమములో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయా మోహన్ తన బృందంతో అయ్యప్ప స్వామి ముందర వేసిన రంగవల్లి చూపురలను విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లిలో ఉపయోగించిన వివిధ రకాల రంగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరియు దైవత్వాన్ని జోడించాయి.
రాంకుమార్ మరియు అతని బృందం నామసంకీర్తన భజనలతో పాటు బృందంలోని కొంత మంది స్త్రీలు శ్రీకృష్ణుని మూర్తి చుట్టూ చేసిన కోలాట నాట్య ప్రదర్శన ప్రేక్షలకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమములో పాల్గొన్న భక్తులు ఎంతో తన్మయత్వంతో అయ్యప్పస్వామి భక్తి గీతాలను ఆలపించారు. సభా ట్రస్టీలలో ఒకరైన శంకర్ తాళాల (కంజీర) కళాకారుడిగా భజనలో పాల్గొనడం విశేషం. గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక పాయసం తయారు చేయడంలో అనుభవంవున్న రత్నం గణేష్ నేతృత్వంలోని బృందం పాలు, బెల్లం మరియు కొబ్బరి పాలతో పాయసం తయారు చేసారు. గత 6 దశాబ్దాలకుపైగా వారసత్వంగా ఈ పాయసం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి యువతరం చురుకుగా పాల్గొనడం అత్యంత విశేషం . ఉత్తరాంగ పూజానంతరం పడి పాట్టుతో 18 మెట్లపై దీపాలు వెలిగించారు. శబరిమలై లో రోజు ముగింపు పాటగా పాడే ప్రసిద్ధ హరివరాసనంతో కార్యక్రమము ముగిసింది.
సంవత్సరాల తరబడి అనుసరిస్తున్న ఆచారం ప్రకారం, సభ యొక్క నివాస పూజారులు అయిన విజయ్ కుమార్, కణ్ణన్, మరియు కార్తీక్ వారి సేవలకు, అలాగే వివిధ రకాలుగా సేవ చేస్తూ మరియు సహకరిస్తున్న సంఘ సభ్యులను సభ సత్కరించింది. ఇటీవల ముగిసిన సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అతిరుద్రం కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన సభ స్వచ్చంద కార్యకర్తలు అయిన సురేష్ శ్రీనివాసన్, వి జయరామన్, శ్రీరామ్, ఎంవి సీతారామన్, నారాయణన్ కె జె, శివకుమార్ వెంకటసుబ్రమణియన్, శ్రీకాంత్ సోమసుందరం, సత్యనారాయణన్ గోపాలన్, గణేష్ రామన్, మణికందన్ బాలసుబ్రమణియన్, స్వామినాథన్ రమణి, నారాయణసామి వెంకటసుబ్ర మణియన్, గణేష్ కుమార్ వి వి, రమేష్ ముకుంత్, సుజిత్ కుమార్ తదితరులను సభ అధ్యక్షుడు ఘనంగా సత్కరించారు.