కృత్రిమ మేధ(ఏఐ)పై వ్యక్తమైన ఆందోళనలు నిజమవుతున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగాలు ఊడుతాయనే హెచ్చరికలు వాస్తవరూపం దాల్చుతున్నాయి. చిన్న ఐటీ సంస్థల నుంచి బహుళ జాతి టెక్ కంపెనీల వరకు ఏఐపై ఆధారపడటం పెరుగుతున్నది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కోడింగ్ రాసే పనిని ఏఐ చేసి పెడుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కష్టకాలమే అనేది స్పష్టమవుతున్నది. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 2024 మూడో త్రైమాసికంలో గూగుల్ పనితీరుపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గూగుల్ కొత్త కోడ్‌లో 25 శాతం కృత్రిమ మేధ ద్వారానే జనరేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, తర్వాత ఈ కోడ్‌ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కోడర్లు పరిశీలిస్తున్నట్టు చెప్పారు.