చైతన్య రావ్, లావణ్య జంటగా నటిస్తున్న సినిమా అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్నారు. చెందు ముద్దు దర్శకుడు. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భగా సురేష్ బాబు మాట్లాడుతూ అన్నపూర్ణ ఫోటో స్టూడియో పేరుతో వస్తోన్న ఈ మూవీ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ 80వ దశకంలో ఓ గ్రామ నేపథ్యంగా సాగే చిత్రమిది. ఆ కాలంలోని గ్రామ వాతావరణాన్ని మా చిత్రం ప్రతిబింబిస్తుంది. ఫన్‌తో పాటు క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ కాపీ చూశాక పూర్తి సంతృప్తిగా ఉన్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. ఒక ప్రత్యేక చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మిహిర, ఉత్తర, వైవా రాఘవ్ తదితరులు నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.