తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వెహికిల్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను తెచ్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనిపై త్వరలో అక్కడి ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తైవాన్‌కు చెందిన ఆర్థిక, సాంస్కృతిక కేంద్ర (టీఈసీసీ) బృందం ప్రగతి భవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ విధానాలతోపాటు టీఎస్ ఐ`పాస్ గురించి టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ నేతృత్వంలోని బృందానికి మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇతర ప్రధాన రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను తెలిపారు.