టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్నేషసల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్‌ఎఫ్) గ్లోబల్ జ్యూనికార్న్, ఏఐ సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్‌కు చెందిన గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సమ్మిట్‌లో టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వ్యవస్థాపకుడు డాక్టర్ జేఏ చౌదరి ఆధ్వర్యంలో దూరదృష్టితో ఐఎస్‌ఎఫ్, యూఎస్‌ఏ అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, వసతి, వర్క్‌షాపులు, డెమో డే తదితర సౌకర్యాలను ఉచితంగా అందించారు.

లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డులు-2025
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.
జయ్ తల్లూరి – ఇన్‌ఫ్రా, సామాజిక అభివృద్ధి
ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,
స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,
నిశిత్ దేశాయ్ -న్యాయ రంగ మార్గదర్శకత,
లాక్స్ చెపూరి- ఇన్నోవేషన్ అవార్డు- టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్.
గత నెలలో ఆకస్మికంగా మరణించిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం రామ్ పుప్పాల ఇన్వోవేషన్ అవార్డును ప్రదానం చేయనున్నామని ఐఎస్‌ఎఫ్ యూఎస్‌ఏ అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.

విద్యార్థుల ఆవిష్కరణలు :
NaturaShe : బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.
Sense Vide :దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.
Jalapatra : తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరం
NGreenTech : ఈ- వేస్ట్ రీసైక్లింగ్ మోడల్
వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ, థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.

పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లుగా వ్యవహరించగా, డాక్టర్ మహేష్ తంగటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలరెడ్డి నిర్వహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు నాసా స్పేస్ సెంటర్, టెక్సాస్ సైన్స్ మ్యూజియం, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్‌లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.

ఐఎస్‌ఎఫ్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్వేయ్యంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు, ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ఐఎస్‌ఎఫ్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు.
