Namaste NRI

మహిళా సాధికారతకు తానా ఫౌండేషన్ (TANA Foundation) అండ .. విజయవాడలో మహిళలకు 100 కుట్టు మిషన్ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అనుబంధమైన తానా ఫౌండేషన్ (TANA Foundation) ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో “Stitching Hope – Sewing Machines to Empower the Needy” కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన మహిళలకు 100 కుట్టు యంత్రాలను పంపిణీ చేశారు.

ఈ సేవా కార్యక్రమానికి తానా కోశాధికారి రాజా కసుకుర్తి ప్రాయోజకత్వం వహించగా, తానా అధ్యక్షుడు డా. నరెన్ కోడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మరియు తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయవాడలోని ఎన్.ఏ.సి కళ్యాణ వేదిక (N.A.C Kalyana Vedika), గురునానక్ కాలనీ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నీ , విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు మరియు మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి గద్దె అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు విజయవాడ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. తానా ఫౌండేషన్ సమాజ సేవలో చేస్తున్న కార్యక్రమాలను ముఖ్య అతిథులు ప్రశంసిస్తూ, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రేరణాత్మకమని అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఈ కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యాన్ని వివరించారు. ‘Stitching Hope – Sewing Machines to Empower the Needy’ అనే ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తానా ఫౌండేషన్ చిన్న ప్రయత్నం చేస్తోంది,” అని ఆయన తెలిపారు.

తానా ఫౌండేషన్ ఎప్పుడూ “సేవే లక్ష్యం” అనే భావనతో పనిచేస్తోందని, అమెరికా లొ ఉన్న తెలుగు ప్రజలను ఒకటిగా చేర్చి సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్య, ఆరోగ్యం, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తానా ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ రోజు పంపిణీ చేస్తున్న కుట్టు యంత్రాలు కేవలం యంత్రాలు మాత్రమే కాదు. ఇవి ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక స్వావలంబనకు, ఒక కుటుంబానికి కొత్త ఆశకు ప్రతీకలు,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ యంత్రాలను అందుకునే మహిళలు తమ ప్రతిభతో, కృషితో తమ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక చిన్న అవకాశం కూడా చాలా పెద్ద మార్పును తీసుకురాగలదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తానా ఫౌండేషన్ నాయకత్వానికి, స్థానిక నిర్వాహకులకు, మరియు వాలంటీర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగం కావడం తనకు గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు
ఎంపీ కేసినేని చిన్నీ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ తానా ఫౌండేషన్ సేవలను ప్రశంసిస్తూ, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా ఫౌండేషన్ సేవా స్పూర్తి అభినందనీయం అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కుట్టు యంత్రాలను స్వీకరించారు. ఈ యంత్రాల ద్వారా తమ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుచుకుంటామని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events