Namaste NRI

బోస్టన్‌లో ఘనంగా టీడీపీ మహానాడు

అమెరికాలోని బోస్టన్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించింది.  ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు.  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  2200 మందితో బోస్టన్‌లో మహానాడు నిర్వహణ గర్వకారణమని అభినందించారు.  తెలుగుదేశం ఆవిర్భావం తరువాతనే తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని అన్నారు. 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పునర్మిర్మాణం జరపాల్సి ఉందని అన్నారు.  తెలుగుదేశం అధికారంలోకి రావాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటున్నారని అన్నారు.

                  లక్షల మంది ఉన్నత చదువులతో ఐటీ రంగంలో స్థిరపడడానికి నాడు తెలుగుదేశం ప్రభుత్వ తీసుకున్న పాలసీలే కారణం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల వెతలు,  వ్యవస్థల విధ్వంసంపై ప్రవాసులతో మాట్లాడారు. జగన్‌ పాలనతో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందన్నారు.  పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను జగన్‌ ఎలా ధ్వంసం చేశారో ప్రజలు చూశారని విమర్శించారు.  తెలంగాణలో కొన్ని  కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్‌. కృష్ణయ్య లాంటి వారికి, తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు.  తాను ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని అన్నారు.  2024లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్‌ఆర్‌ఐలు తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు.

                టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసుల సహకారం అవసరమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.  ఎన్నారైల సహకారంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం  చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, వైవీ ప్రభాకర చౌదరి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నన్నారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నారై టీడీపీ కన్వీనర్‌ కోమటి జయరాం నేతలకు స్వాగతం పలికారు. మహానాడుకు పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News