దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని, తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్ -వరంగల్ జాతీయ రహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల`వరంగల్ జాతీయరహదారి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సంకల్పసభలో తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు.. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఈ రోజు రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామని తెలిపారు. దేశాభివృద్ది కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. అనేక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్`ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం అని మోడీ తెలిపారు.


