తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (టీఎస్ఎన్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు బడి 2025-26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు. గత విద్యాసంవత్సరానికి లభించిన విశేష ఆదరణ ఆధారంగా నిర్వాహకులు ఈ సంవత్సరం 30 మంది పిల్లల చేరిక ఉంటుందని భావించినప్పటికీ, 60 మందికి పైగా పిల్లలు చేరడం నెబ్రాస్కా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు తమ అనుభవాలు, స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించారు. డాక్టర్ ఫణి తేజ్ అడిదమ్ యు ఎన్ ఓ ప్రొఫెసర్, మాజీ హిందూ దేవాలయ చైర్మన్ తెలుగు భాష, సంస్కారం, సాంప్రదాయం, భవిష్యత్ జ్ఞానం అని ఒక గొలుసు లాగా అనుసంధానమై ఉంటాయని వివరించారు. డాక్టర్ చంద్రకాంత్ ఆరే బహుభాషలు నేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.


డాక్టర్ మురళీధర్ చింతపల్లి మాట్లాడుతూ ఒమాహాలో తన తొలి అనుభవాలను పంచుకుంటూ, తెలుగు బడి, టిఎస్ఎన్ కార్యవర్గం సాధించిన పురోగతిని అభినందించారు. మల్లికా జయంతి మాట్లాడుతూ నాట్య గురువు, గురుకులం సెంటర్ ఫర్ ఇండియన్ ఆర్ట్స్ భాష, కళలు, సంప్రదాయాలు, సంస్కృతుల అనుబంధాన్ని హృద్యంగా వివరించారు. రాజా కోమటిరెడ్డి అధ్యక్షులు మాట్లాడుతూ పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుగు బడి ద్వారా పొందే లాభాలను స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలతో భాగస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠ్య ప్రణాళిక ఆవిష్కరణపై వివరిస్తూ, సభలో పాల్గొన్నవారి నుంచి విశేష ఆదరణ పొందారు. కార్యక్రమంలో తానా పాఠశాల చైర్మన్ భాను , తోటకూర ప్రసాద్, సుందర్ చూకర తదితరులు ప్రసంగించారు.


ఈ కార్యక్రమంలో తెలుగు బడి ఉపాధ్యాయులు వేణు, దివ్యముఖ, పవిత్ర, స్వప్నా, వీణా మాధురి, సుధీర్ లంక అధికారికంగా పరిచయం చేశారు. అనంతరం తల్లిదండ్రులు, పిల్లలకు తమను తాము పరిచయం చేసుకున్నారు.అలాగే, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, పిల్లలతో ప్రశ్నోత్తర సెషన్ నిర్వహించగా, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా తానా పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠ్య ప్రణాళిక అందుబాటులో ఉండటం వారికి విశేషంగా ఆనందాన్ని ఇచ్చింది.


సభ విజయవంతం కావడానికి సహకరించిన కార్యవర్గం, అతిథులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్జే ఝాన్సీ సమన్వయం, ఆకర్షణీయమైన నిర్వాహణతో కార్యక్రమానికి విశేష అందాన్ని చేర్చారు. కొల్లి ప్రసాద్, కార్యవర్గం తరఫున తానా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజా కసుకర్తి, భాను మగులూరి, తానా అధ్యక్షులు నరేన్ కొడాలికి నెబ్రాస్కా తెలుగు బడి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి ముగింపు వరకు అహర్నిశలూ శ్రమించి విజయవంతం చేయడంలో భాగస్వామ్యం చేసిన తాతారావు, సాంబా, రమేష్, అనిల్, వేణు మురకొండ, వీరు ముప్పారాజు, పవన్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి కృషిని రాజా కోమటిరెడ్డి సభలో ప్రత్యేకంగా ప్రశంసించారు.















