విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పలు యూరప్ దేశాల్లోకి కాలేజీలను ఎంచుకొంటుంటారు. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకారం ఆ దేశంలో 2.2 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 41 శాతం. అయితే ఖలిస్థాన్ తీవ్రవాదంపై కెనడా, భారత్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే కెనడాలో కాలేజీలకు ఐప్లె చేసుకొన్న విద్యార్థులు పునరాలోచనలో పడగా, భవిష్యత్తులో కెనడాకు వెళ్లాలనుకొంటున్న విద్యార్థులు ప్లాన్ బీ గా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల వైపు చూస్తున్నారు. విదేశీ విద్య కన్సల్టెంట్లు కూడా ఇదే విధమైన సూచనలు చేస్తున్నాయి. ఆయా దేశాల్లో కూడా టాప్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని, విద్యార్థులు తమ ఉన్నత విద్య లక్ష్యాలను చేరుకోవడంలో సహకరిస్తాయని రీచ్ఐవీ సీఈవో విభ కగ్జి పేర్కొన్నారు.
