ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. జులై 15న టెస్లా భారత్‌లో తొలి షోరూంను అఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీపై టెస్లా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టెస్లా ఇండియా పేరుతో ఎక్స్ ఖాతాను తెరిచింది. అందులో తొలి పోస్ట్‌గా కమింగ్ సూన్ అంటూ ఓ ఫొటోను డ్రాప్ చేసింది. ఈ ఏడాది జులైలో భారత విపణిలోకి అడుగుపెట్టనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.

ముంబై జియో వరల్డ్‌లో టెస్లా తన మొదటి ఈ షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. డిమాండ్‌ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షో రూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సదరు నివేదికలు వెల్లడించాయి.
















