గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ మార్గాలను అన్వేషిస్తున్నారని, అమెరికా సైన్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఎప్పటికీ అధ్యక్షుడికి ఉంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. వైట్ హౌస్ వ్యాఖ్యలతో నాటో సభ్య దేశమైన డెన్మార్క్‌తో అమెరికాకు తలెత్తిన ఉద్రిక్తతలు మరింత తీవ్రం కానున్నాయి. అపార్థాలను తొలగించుకోవడానికి అమెరికాతో వెంటనే సమావేశం నిర్వహించాలని గ్రీన్‌లాండ్, డెన్మార్క్ కోరుతున్న తరుణంలో అమెరికా నుంచి తాజా హెచ్చరికలు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెనెజువెలాలో అమెరికా సైనిక జోక్యం తర్వాత ఆర్కిటిక్‌లోని స్వయం ప్రతిపత్తితో కూడిన డానిష్ ద్వీపం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు.

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం ప్రత్యర్థి దేశాలైన రష్యా, చైనాను నిలువరించడానికి అమెరికాకు జాతీయ భద్రతాపరమైన ప్రాధాన్యతగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అభివర్ణించారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధానం లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించాల్సిన భిన్న మార్గాలపై అధ్యక్షుడు, ఆయన బృందం విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. అయితే ఇందుకోసం అమెరికా సైన్యాన్ని ఉపయోగించుకోవడం అధ్యక్షుడికి ఎల్లప్పుడూ ఉండే అవకాశమేనని ఆమె పేర్కొన్నారు.















