రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం స్కంద. ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 15న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన స్కంద-ది అటాకర్ ప్రీరిలీజ్ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ దేవదాస్ చిత్రం నుంచి రామ్ ప్రయాణాన్ని చూస్తున్నా. ప్రతి సినిమాలో వైవిధ్యం కనబరుస్తున్నాడు. మనందరం గర్వించదగ్గ నటుడు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. స్కంద ఈ టైటిల్‌కు శిరసు వంచి నమస్కరిస్తున్నా. తెలుగులో వినూత్నమైన కథలొస్తున్నాయి. అందుకే మన సినిమాలకు విదేశాల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో మూడు సినిమాలు చేశాను. ఆయన అంకితభావంతో శ్రమిస్తాడు. ఈ సినిమాలో పెద్ద నటులు భాగమయ్యారు. తప్పకుండా భారీ విజయం తథ్యమనిస్తున్నది అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా. యాక్షన్, ఎమోషన్స్ మరో స్థాయిలో ఉంటాయి. నటుడిగా ఉత్తమ ప్రతిభ కనబరచాలని హీరో రామ్ నిరంతరం తపిస్తాడు. బాలయ్య అభిమానులు అఖండ సీక్వెల్ గురించి అడుగుతున్నారు. ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. వివరాలను తర్వాత తెలియజేస్తా అన్నారు. స్కంద సినిమా ద్వారా బోయపాటితో హ్యాట్రిక్ కొట్టబోతున్నానని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. హీరో రామ్ మాట్లాడుతూ ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలనుందని నిర్మాత శ్రీనివాస్ ఐదేళ్ల క్రితమే నాతో అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో నన్ను కొత్త పంథాలో చూపించారు. నా కెరీర్‌లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. అభిమానుల కోసం ఎంత కష్టానికైనా సిద్ధంగా ఉన్నా. వినూత్నమైన కథలతో సినిమా చేస్తా. అభిమానులే నా అదృష్టం అని అన్నారు.