ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో మరో ఏడాది వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఆయన ఈడీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రాకు రెండేండ్ల నిర్ణీత పదవీకాలం 2020లో పూర్తి కాగా కేంద్రం ఇప్పటికే ఒక ఏడాది పొడిగించింది. సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేయగా కేంద్రం ఆర్డర్‌లో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ ఏడాది నవంబర్ 17 తర్వాత ఆయన సర్వీస్‌ను పొడిగించవద్దని పేర్కొంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ), సీబీఐ డైరెక్టర్ల పదవీకాలన్ని మూడేళ్ల వరకూ (రెండేళ్ల ప్రాథమిక పదవీకాలం తర్వాత) పొడిగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాక తొలిసారి ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు అవకాశాన్ని పొందిన అధికారిగా సంజయ్ కుమార్ మిశ్రా నిలవడం గమనార్హం.














