నెబ్రాస్కా తెలుగు సమితి (టీఎస్‌ఎన్) ఆధ్వర్యంలో తొలి యువజన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించింది. పాఠశాల, నుంచి కాలేజీ వరకు అనేక మంది భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు, మెంటార్‌షిప్, సాంస్కృతిక అనుబంధానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన పలువురు యువ నిపుణులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థులు తమ భారతీయ అమెరికన్ మూలాలను మర్చిపోకుండా, విద్య, వృత్తిపరమైన రంగాల్లో ఎలా రాణించాలనే అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించింది. టీఎస్‌ఎన్ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ కలిసి ఉండండి, మీ మూలాలను మర్చిపోకండి, అప్పుడు మీరు ఎప్పుడూ ఒంటరి వారు కాదని అన్నారు.


ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డాక్టర్ గురుదత్ పెండ్యాల (యుఎన్‌ఎంసీ, అనస్థీషియాలజీ ప్రొఫెసర్), రెబెకా పాటర్ (యూనియన్ పసిఫిక్ లేబర్ రిలేషన్స్ మేనేజర్), కీనోట్ స్పీకర్ క్రాంతి ఆదిదం (టీఎస్‌ఎన్ వ్యవస్థాపక అధ్యక్షుడు) పాల్గొని ప్రసంగించారు. వ్యాపార వ్యూహాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై విద్యార్థులకు క్రాంతి ఆదిదం దిశానిర్దేశం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, లా, బిజినెస్, మెడిసిన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందిన యువ నిపుణులతో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెరీర్ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంలో వారు ఇచ్చిన సలహాలు, సూచనలు, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ఒమాహాలో భారతీయ సమాజం నుండి ఈ సదస్సుకు అద్భుతమైన స్పందన లభించింది. చదువు, సంస్కృతికి మధ్య ఉన్న అంతరాన్ని ఈ సదస్సు భర్తీ చేసిందని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు. విద్యార్థులు తమ సాంస్కృతిక మూలాల పట్ల గర్వంతో, కొత్త ఉత్సాహంతో పాటు బలమైన కమ్యూనిటీ బంధాలతో ఈ సదస్సు నుంచి తిరిగి వెళ్లారు. యూత్ కమిటీ చైర్ క్రాంతి సుధ, కో-చైర్ వివేక్ పోషాల, సంఘం అధ్యక్షుడు కొల్లి ప్రసాద్‌తోపాటు ఇతర వాలంటీర్ల నాయకత్వంలో ఈ సదస్సు విజయవంతమైంది.
















