తెలంగాణ ప్రాంతానికి చెందిన పైడి జయరాజ్ లాంటి మహానీయుడి చరిత్ర గురించి తెలుగు చిత్రసీమకు ఎక్కువగా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలనాటి బాలీవుడ్ దిగ్గజం పైడి జయరాజ్ 112వ జయంతి వేడుకలు జైహింగ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగాయి. ఈ వేడుకుకు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జయరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడి జయరాజ్ జయంతి వేడుకల్ని ప్రతి ఏడాది జైహింగ్ గౌడ్ అద్భుతంగా జరుపుతున్నారు. జయరాజ్ జ్ఞాపకార్థం రవీంద్రభారతిలో ఆయన పేరు మీద ప్రభుత్వం పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ను ఏర్పాటు చేసింది. జైహింద్ గౌడ్ కోరినట్లు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. మూకీల సమయంలోనే అగ్రహీరోగా పేరు తెచ్చుకున్న పైడి జయరాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
జయరాజ్ విగ్రహాన్ని ఛాంబర్ ఆవరణలో లేదా ఫిలిం నగర్లో ఏర్పాటు చేయాలని మంత్రిని కోరుతున్నానని నటుడు జైహింద్ గౌడ్ అన్నారు. 1989లోనే ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ని తెలుగు పరిశ్రమ మరిచిపోయింది. ఆయన జయంతి వేడుకల్ని 2010 నుంచి నిర్వహిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ప్రియాంక పాల్గొన్నారు.