అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత కొన్నేళ్లుగా నిద్రకు సంబంధించి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం తెలిపింది. అధ్యక్షుడు దాదాపు 2008 నుంచి స్లీప్ ఆప్నియా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆయన పడుకునే టప్పుడు సీప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) యంత్రాన్ని వాడుతున్నట్లు తెలిపింది. రాత్రి సమయంలో సీప్యాప్ మెషీన్ ను బైడెన్ ధరించి పడుకోగా, ఆ మచ్చలు ముఖంపై పడ్డాయి. వైట్ హౌస్ నుంచి అధ్యక్షడు బయటకు వచ్చిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపిండచంతో శ్వేత సౌధం ఈ విషయాన్ని వెల్లడించింది.
వైద్యుల సూచన మేరకు బైడెన్ సీప్యాప్ మెషీన్ ను ముఖానికి ధరించి నిద్ర పోతున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ యంత్రం ఓ మోటారు సాయంతో గాలిని శ్వాసనాళాల్లోకి పంపుతుంది. దీంతో మెరుగైన శ్వాస ఆడి రాత్రంతా హాయిగా నిద్రపడుతుంది. జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆప్నియా కారణంగా ఆయన హార్ట్ బీట్ లో సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు గుర్తించారు.
సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ ఆప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది చాలా మందిలో కనిపించే ఓ తీవ్రమైన సమస్య. దీని వల్ల గురక వస్తూ నిద్ర సరిగా పట్టదు. నిద్రలో ఉన్న సమయంలో గాలిపీల్చుకోవడం తరచూ ఆగిపోతూ ఉంటుంది. దాంతో గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాలో సుమారు కోట్ల మందిలో ఇటువంటి సమస్య ఉండొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.