సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోకసభ స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కు అవకాశమిచ్చారు. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు ఓటు వేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందు కు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
ఓటర్ టర్న్ అవుట్ యాప్ ప్రకారం, సాయంత్రం 5గంటల వరకు అసోంలో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా బిహార్‌లో 53.03, ఛత్తీస్‌గఢ్ 72.13, జమ్ముకశ్మీర్ 67.22, కర్ణాటక 63.90, కేరళ 63.97, మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తర్‌ప్రదేశ్ 52.74, బంగాల్ 71.84 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగ్గా, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు 14చోట్ల పోలింగ్ జరిగింది. రాజస్థాన్‌లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగ్గా, మిగిలిన 13 చోట్ల పూర్తి అయింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బిహార్‌లో ఐదేసి, మధ్యప్రదేశ్‌లో ఆరు, బంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో మూడేసి, త్రిపుర, మణిపుర్, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. జూన్ 04 ఈ ఫలితాలు వెల్లడి కానున్నాయి.