అమెరికా శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. కాలు విరిగిపోతే కొయ్యకాలు పెట్టుకుంటాం. కానీ ఇకనుంచి ఆ అవసరం ఉండదేమో. విరిగిన చోటునుంచే చక్కగా కాలును మళ్లీ పెంచుకోవచ్చు తెగిపోయిన శరీరభాగాలు పెంచుకునే ప్రక్రియను టఫ్ట్స్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. కాలు తెగిపోయిన ఓ కప్పతో వారు జరిపిన ప్రయోగంలో విజయం సాధించారు. ఇందుకు వారు ఐదు ఔషధాల మిశ్రమాన్ని వినియోగించారు. ఓ చిన్న సిలికాన్ తిత్తిలో ఆ మిశ్రమాన్ని పోసి కప్ప తెగిన కాలికి తగిలించారు. కొన్నాళ్ల తర్వాత చూస్తే కప్ప కాలు పెరిగినట్టు కనిపించింది. మేము ఎంచుకున్న ఔషధాలు అనుకున్న ఫలితాలు సాధించడం సంతోషం కలిగించింది అని అధ్యయనం బృందం నివేదిక రూపొందించిన నిరోషా మురుగున్ తెలిపారు. జంతువులలో నిద్రాణంగా ఉండే పునరుద్ధరణ సామర్థ్యాన్ని అవి తట్టిలేపాయని అన్నారు. తదుపరి దశలో క్షీరదాలపై ప్రయోగాలు చేయనున్నట్టు తెలిపారు. అంతిమంగా మానవులకు ఉపయోగకరమైన రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు.














