అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసాల పునరుద్ధరణ కోసం వారు భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబో తున్నట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తూ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్న ఎంతో మంది భారత వృత్తి నిపుణులకు వరంలా నిలిచే ఈ కార్య క్రమం ఈ ఏడాదిలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నది. అమెరికాలో హెచ్-1బీ వీసాల కోసం ఇప్పటికే ప్రయోగా త్మకంగా చేపట్టిన కార్యక్రమం (పైలట్ ప్రోగ్రామ్) విజయవంతంగా ముగియడంతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది అమెరికా బేస్డ్ వీసా రెన్యువల్ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు అమెరికా తెలిపింది.