తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో డాలర్ శేషాద్రి భౌతికకాయం ఉంచారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు తిరుపతి గోవిందధామంలో శేషాద్రి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈరో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీకాదని చెప్పారు. ఆరోగ్యరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లొదని శేషాద్రిని సూచించానన్నారు. స్వామివారి సేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారిని ధర్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. శ్రీవారి సేవలో తరించడమే తన జీవిత లక్ష్యమని శేషాద్రి చెప్పేవారని వివరించారు. 2013లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగిందని ధర్మారెడ్డి తెలిపారు. డాలర్ శేష్రాది మరణం బాధాకరమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.