దండోరా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నాకు గద్దర్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉంది అని సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అవార్డు నా బాధ్యతను పెంచింది. భవిష్యత్‌లో మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు నాలో ప్రేరణ నింపింది అని అన్నారు. మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినా, వెలుగులోకి రాకపోవడానికి కారణం తాను ఇంట్రావర్ట్ కావడమేనని మార్క్ కె.రాబిన్ అభిప్రాయపడ్డారు. దండోరా చిత్రానికి రాష్ట్రప్రభుత్వం తనను ఉత్తమ సంగీత దర్శకునిగా గుర్తించి అవార్డు ఇవ్వడం కెరీర్ పరంగా కూడా తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు మార్క్ కె.రాబిన్. దండోరా విషయంలో మంచి సంగీతం ఇచ్చేందుకు పురిగొలిపింది ఆ సినిమా కథాంశమే అని అన్నారు.

అంతిమ సంస్కారాలకు సైతం అడ్డుగా నిలిచే కులవివక్ష, మనషుల్లో మందగిస్తున్న మానవత్వం, వీటన్నింటి గురించీ దర్శకుడు మురళీకాంత్ వివరించగానే మనసు చలించిపోయింది. భావోద్వేగం నిండిన మనసుతో దండోరా కు సంగీతం అందించాను. స్థానిక సంగీతంపై నాకు అవగాహన ఉంది. దానికి తగ్గట్టే స్థానిక వాయిద్యాలతోనే మ్యూజిక్ చేశాను. ఆ ప్రభావమే ఇదంతా అని రాబిన్ పేర్కొన్నారు.















