ఆర్‌ఆర్‌ఆర్ సమయంలో సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు జర్మనీ వరకు వెళ్లాల్సివచ్చింది. మనదేశంలో ఆ సదుపాయం లేకపోవడం నిరుత్సాహపరచింది. కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ విజన్ గ్రేడింగ్ సౌకర్యాన్ని చూసి థ్రిల్ అయ్యాను అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఇటీవల హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్స్ ఫెసిలిటీ యూనిట్‌ను రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ డాల్బీ విజన్‌లో సినిమాను చూడటం సరికొత్త అనుభవమని, ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టతతో కథను మరో స్థాయికి తీసకెళ్తుందని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ ఛైర్మన్, అగ్ర హీరో నాగార్జున మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. వర్చువల్ ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశాం. ఇది మా ప్రయాణంలో మరో ఘనత అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ సుప్రియా యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.