
కృత్రిమ మేధ(ఏఐ) సుదూర ఆలోచనగా భావిస్తున్న వారికి ఇది చేదువార్త. 2025లో ఏఐ పనితీరును చూశామని, రానున్న కాలంలో ఇది మరిన్ని రంగాల్లో తన ప్రతిభా పాటవాలను చూపగలదని ఏఐ గాడ్‌ఫాదర్‌గా పిలిచే జెఫ్రీ హింటన్ తెలిపారు. ఏఐ వేగాన్ని బట్టి 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ బూమ్‌కు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రానున్న కాలంలో ముఖ్యంగా వైట్-కాలర్ ఉద్యోగాల్లో పెను మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని జెఫ్రీ చెప్పారు. ఆలోచన, రచన, విశ్లేషణ లేదా నిర్ణయాత్మక అధికారంపై ఆధారపడిన ఉద్యోగాలు ఇప్పటికే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మెదడు చేసే పనిని ఏఐ చేయడం మొదలుపెట్టింది. ఈ మార్పుకు నిరుద్యోగిత భారీ పెరుగుదలకు దారితీయగలదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉత్పాదకత పెరిగి వ్యాపారాభివృద్ధి జరగవచ్చేమో కాని కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోవచ్చని వారు భావిస్తున్నారు.















